Fashion Technology: ఇంట‌ర్ త‌ర్వాత ఫ్యాష‌న్ టెక్నాల‌జీ! 11 month ago

featured-image

చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఫ్యాషన్‌ ప్రభావానికి గురికానివారు చాలా తక్కువ మంది ఉంటారు. ఉన్నంతలో ఆకర్షణీయంగా, హుందాగా కనిపించడానికి ఎక్కువమంది ప్రాధాన్యత నిస్తారు. వస్తువులు, దుస్తుల ఎంపికలో శ్రద్ధ పెడుతూ ఖర్చుకు వెనుకాడటం లేదు. ఈ పరిణామాలన్నీ ఫ్యాషన్‌ టెక్నాలజీ, ఫ్యాషన్‌ డిజైన్‌ నిపుణుల డిమాండ్‌ను పెంచుతున్నాయి. ఫ్యాషన్‌ కోర్సుల్లో ఆసక్తి ఉన్నవారు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌)ల్లో చేర‌వ‌చ్చు. ఈ సంస్థలు పలు యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నాయి. 


ఫ్యాష‌న్ టెక్నాల‌జీ లో ప్ర‌వేశాలు ఇలా!

దేశంలో హైద‌రాబాద్ స‌హా 19 నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ(నిఫ్ట్‌)లు ఉన్నాయి. ఫ్యాష‌న్ టెక్నాల‌జీతో పాటు యాక్సెస‌రీ డిజైన్‌, నిట్‌వేర్ డిజైన్‌, ఫ్యాష‌న్ క‌మ్యూనికేష‌న్‌, లెద‌ర్ డిజైన్‌, ఫ్యాష‌న్ డిజైన్‌, టెక్స్‌టైల్ డిజైన్‌, ఫ్యాష‌న్ ఇంటీరియ‌ర్స్ కోర్సులు అందిస్తున్నాయి. రెండేళ్ల పీజీలో డిజైన్‌, ఫ్యాష‌న్ మేనేజ్ మెంట్‌, ఫ్యాష‌న్ టెక్నాల‌జీ కోర్సులు ఉన్నాయి. నిఫ్ట్‌ల్లో 5500 కు పైగా సీట్లు ఉన్నాయి. ఇందులో చేర‌ద‌ల‌చుకున్న అభ్య‌ర్ధులకి ప‌రీక్ష‌తో అవ‌కాశం లభిస్తుంది. ఈ స్కోరుతోనే దేశవ్యాప్తంగా ప‌లు ఇత‌ర సంస్ధ‌ల్లోనూ చేర‌వ‌చ్చు.


యూజీ, పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాలు!

బ్యాచిల‌ర్ ఆఫ్ డిజైన్ లో చేర‌ద‌ల‌చుకున్న అభ్య‌ర్ధుల‌కి ఇంట‌ర్మీడియ‌ట్ లేదా స‌మాన ఉత్తీర్ణ‌త ఉండాలి. చివ‌రి సంవ‌త్స‌రం చదువుతున్న అభ్య‌ర్ధులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. బ్యాచిల‌ర్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ లో చేరు అభ్య‌ర్ధులకి మ్యాథ్స్‌, ఫిజిక్స్‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణ‌త లేదా మూడేళ్ల డిప్లొమా క‌లిగి ఉండాలి. ఇందులోనూ చివరి ఏడాది విద్యార్ధులూ అర్హులే. ఈ రెండు కోర్సుల‌కూ ఆగ‌స్టు 1, 2025 నాటికి 24 ఏళ్ల‌లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగుల‌కు ఐదేళ్లు మిన‌హాయింపు ఉంటుంది.


మాస్ట‌ర్ ఆఫ్ డిజైన్, మాస్ట‌ర్ ఆఫ్ ఫ్యాష‌న్ మేనేజ్‌మెంట్ లో చేర‌ద‌ల‌చుకున్న వారికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త లేదా నిఫ్ట్ లేదా నిడ్ నుంచి క‌నీసం మూడేళ్ల వ్య‌వ‌ధితో యూజీ డిప్లొమా క‌లిగి ఉండాలి. మాస్ట‌ర్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ లో చేరేవారికి నిఫ్ట్ నుంచి బ్యాచిల‌ర్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ (బీఎప్‌టెక్‌) లేదా ఏదైనా సంస్ధ నుంచి బీఈ/ బీటెక్ క‌లిగి ఉండాలి. చివ‌రి ఏడాది విద్యార్ధులూ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. పీజీకి గ‌రిష్ఠ వ‌య‌సు నిబంధ‌న ఏమీ లేదు. పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయాలి.


ఫ్యాష‌న్ టెక్నాల‌జీలో ప్ర‌వేశ‌ ప‌రీక్ష‌!

విద్యార్ధులు ఎంచుకున్న కోర్సు ప్ర‌కారం ప్ర‌శ్నాప‌త్రం మారుతుంది. నెగిటివ్‌ మార్కులు ఏమీ ఉండ‌వు. ప్ర‌తి స‌రైన స‌మాధానానికీ ఒక మార్కు. 

కొన్ని కోర్సుల్లో చేరడానికి ప్ర‌వేశ పరీక్ష ఒక్కటే సరిపోతుంది. మిగిలిన వాటికి పరీక్షతోపాటు అద‌నంగా గ్రూప్‌ డిస్కషన్ లేద ఇంటర్వ్యూ, క్రియేటివ్‌ ఎబిలిటీ టెస్టు, సిచ్యుయేషన్‌ టెస్టు ఉంటాయి. 

బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్, మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశాల‌కు జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌ (జీఏటీ) ను నిర్వహిస్తారు. ప్ర‌శ్నాప‌త్రం ఇంగ్లీష్ మ‌రియు హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ప‌రీక్ష‌కు 2 గంట‌ల‌ స‌మ‌యాన్ని కేటాయిస్తారు. 

బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌లో మొత్తం వంద ప్రశ్నలు ఇస్తారు. వీటిలో క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ 20 ప్రశ్ర‌లు, కమ్యూనికేషన్‌ ఎబిలిటీ అండ్‌ ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్ 40 నుండి ప్ర‌శ్న‌లు, అనలిటికల్‌ అండ్‌ లాజికల్‌ ఎబిలిటీ నుండి 15 ప్రశ్నలు అలాగే జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్ నుండి 25 ప్రశ్నలు వస్తాయి.

 బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (బీఎఫ్‌టెక్‌), మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (ఎంఎఫ్‌టెక్‌), మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు జనరల్‌ ఎబిలిటీ టెస్టు (జీఏటీ) నిర్వహిస్తారు. దీనిలో రెండు సెక్షన్ల నుంచి 150 ప్రశ్నలుంటాయి. వీటిని మూడు గంటల్లో పూర్తిచేయ వ‌ల‌సి ఉంటుంది. 

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ పరీక్షలో క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ నుండి 35 ప్ర‌శ్న‌లు, కమ్యూనికేషన్‌ ఎబిలిటీ అండ్‌ ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్ నుండి 40 ప్ర‌శ్న‌లు, అనలిటికల్‌ అండ్‌ లాజికల్‌ ఎబిలిటీ నుంచి 30 ప్ర‌శ్న‌లకి గానూ అలాగే జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. అద‌నంగా కేస్‌ స్టడీకి 20 మార్కుల‌ని కేటాయించారు.


సిల‌బ‌స్‌:

 క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ: వడ్డీ రేట్లు, పని-కాలం, దూరం-వేగం, నిష్పత్తి, సగటు, కూడికలు, గుణింతాలు, భాగహారం, తీసివేతలు, శాతాలు, భిన్నాలు త‌దిత‌ర అంశాల్లో తేలిక పాటి నుండి మధ్యస్థ ప్రశ్నలు వస్తాయి. హైస్కూల్‌ మ్యాథ్స్‌ పుస్తకాల్లో ఈ అంశాలు బాగా చదివి వీటి పై మంచి ప‌ట్టు సాధిస్తే చాలు. ప్రాథమికాంశాలపై దృష్టి సారిస్తే ఎక్కువ మార్కులు పొందడం తేలిక‌గా ఉంటుంది. 


కమ్యూనికేషన్‌ ఎబిలిటీ: ఇంగ్లీషు భాష‌లో ప్రావీణ్యం తెలుసుకునేలా ఈ ప్రశ్నలుంటాయి. వ్యాకరణంపై అవగాహన, రోజువారీ అవసరాల్లో భాగంగా మాట్లాడటానికి కావాల్సిన పదసంపద ఉందో, లేదో పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. ఆంగ్లంలో పాసేజ్‌లు ఇచ్చి వాటిపై ప్రశ్నలడుగుతారు. ఇవి హైస్కూల్‌ స్థాయిలో ఉంటాయి. ప్రాథమిక వ్యాకరణం, పదసంపదపై దృష్టి పెట్టాలి. సమానార్థాలు, వ్యతిరేకార్థాలు, సామెతలు, నుడికారాలు, సింగ్యులర్, ప్లూరల్, వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూట్స్, స్పెల్లింగ్‌ కరెక్షన్‌ తదితర విభాగాల నుండి ప్రశ్నలు వస్తాయి.


అనలిటికల్‌ ఎబిలిటీ: కొంత సమాచారం ఇచ్చి, దాని నుండి జవాబులు రాబ‌ట్టగ‌లిగేలా ప్రశ్నలు వస్తాయి. ఇందులో అభ్యర్థి యొక్క తర్కం, ఆలోచనాస్థాయిని పరీక్షిస్తారు. ఇచ్చిన సమాచారాన్ని బాగా విశ్లేషించి సమాధానాన్ని గుర్తించగ‌ల‌గాలి. గణితంలో పరిజ్ఞానం ఉన్నవారు ఈ విభాగంలో బాగా రాణించగలరు.  


జనరల్‌ నాలెడ్జ్‌ (జీకే) అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌: వర్తమాన అంశాలు, సంఘటనలతో ముడిపడిన ప్రశ్నలను ఈ విభాగం నుండి అడుగుతారు. జీకేలో అభ్యర్థికి సమాజం, పరిసరాలపై ఉన్న అవగాహనను పరిశీలిస్తారు. తాజా పరిణామాలపై అవగాహన ఉన్నవాళ్లు వీటికి సులువుగానే సమాధానాలు రాయొచ్చు. రోజూ ఏదైనా పత్రిక చదివి అందులోని ముఖ్యాంశాలను నోట్స్‌ రాస్తే ఆ సమాచారాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. జనవరి, 2024 నుంచి వివిధ విభాగాల్లో జరిగిన ప్రధాన అంశాలు, సంఘటనలను మననం చేసుకోవాలి. 


క్రియేటివ్‌ ఎబిలిటీ టెస్ట్‌: అభ్యర్థికి డిజైనింగ్‌లో సృజనాత్మకత ఎలా ఉందో ఈ విభాగం ద్వారా పరిశీలిస్తారు. అభ్య‌ర్ధి రంగులను ఎలా ఉపయోగిస్తున్నారు, పరిశీలనాశక్తి, కొత్తదనం, ఇలస్ట్రేషన్, కళాత్మక నైపుణ్యం వంటి తదితర అంశాల మేళవింపుతో ఈ పరీక్ష ఉంటుంది. ఇందులో స్కెచింగ్‌ నైపుణ్యం, ఊహాశక్తి బాగున్నవారు రాణించగలరు. 


కేస్‌ స్టడీ: దీనిలో ఫ్యాషన్‌ ఇండస్ట్రీకి సంబంధించిన అంశాల గురించి స‌మాచారం ఉంటుంది. అభ్యర్థి యొక్క మేనేజీరియల్‌ నైపుణ్యాన్ని పరిశీలిస్తారు. ఫ్యాషన్‌ ప్రపంచంలో తాజా పోకడలపై అవగాహనను పెంచుకోవాలి. 

రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ఎంపిక చేసుకున్న కోర్సుల‌ను బట్టి సిచ్యువేషన్‌/ స్టూడియో టెస్ట్, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.


సిచ్యువేషన్‌/ స్టూడియో టెస్ట్: ఇందులో అభ్యర్థిలోని సృజనాత్మ‌క‌త‌, 3డీ మోడలింగ్ లో నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. ఇచ్చిన కాన్సెప్ట్‌పై అభ్యర్థికి ఉన్న అవ‌గాహ‌న‌, ఆ అంశంపై ఉన్న పరిజ్ఞానాన్ని మొదలైనవి పరిశీలించి మార్కులు కేటాయిస్తారు. ఫ్యాషన్‌ టెక్నాలజీ/డిజైన్‌ రంగాల్లో రాణించ‌గ‌ల‌గాలంటే స్పష్టమైన అవగాహన, స్కెచింగ్‌ నైపుణ్యం, రంగులు మేళవించడంలో పట్టు ఉండాలి.


కెరియ‌ర్ అవ‌కాశాలు:

ఇంట‌ర్ నుంచి బ్యాచిల‌ర్ డిగ్రీకి మారే స‌మ‌యంలో ప్ర‌తి విద్యార్ధి కెరీర్ ఆప్ష‌న్ సెల‌క్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా భ‌విష్య‌త్తులో మంచి ఉద్యోగ అవ‌కాశాలు ఉండే కోర్సుల‌ను ఎంచుకోవాలి. ఇలా ఫ్యూచ‌ర్‌లో డిమాండ్ ఉండే కోర్సుల్లో ఫ్యాష‌న్ డిజైనింగ్ ఒక‌టిగా నిలుస్తోంది.

ప్రాంగణ నియామకాల్లో నిఫ్ట్‌ విద్యార్థులను బహుళ జాతి సంస్థలు అధిక వేతనానికి తీసుకుంటున్నాయి. ప్రతి సందర్భాన్నీ కూడా వేడుకగా చేసుకునే సంస్కృతి ఈ మ‌ధ్య కాలంలో పెరుగుతోంది. ఆయా కార్యక్రమాల‌కి తగ్గట్టు తళుక్కుమనడానికి ఫ్యాషన్‌ ప్రపంచం వైపు పరుగులు తీస్తున్నారు. అందువల్ల ఆకట్టుకునేలా, కొత్త‌ద‌నం ఉట్టిపడేలా వైవిధ్యంగా దుస్తులూ, వివిధ వస్తువులను డిజైన్‌ చేయగలిగే నైపుణ్యం ఉన్నవాళ్లు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. ఈ కోర్సుల‌ను విజయవంతంగా పూర్తిచేసుకున్న తర్వాత ఫ్యాషన్‌ డిజైనర్, స్టైలిస్ట్‌ (స్టోర్స్‌), ఫ్యాషన్‌ ఆంత్రప్రెన్యూర్, ఫ్యాషన్‌ రిటైలర్, పర్సనల్‌ స్టైలిస్ట్‌/సెలబ్రిటీ స్టైలిస్ట్ త‌దిత‌ర‌ హోదాల్లో రాణించగలరు. సొంతంగా బొటిక్‌ను నిర్వహించుకోవచ్చు. రంగుల ప్రపంచంలోనూ వీరికి మేటి అవకాశాలుంటాయి. 


జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ-మెయిన్స్‌)-2025


Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD