Jawahar Navodaya: జవహర్ నవోదయ విద్యాసంస్ధల్లో అడ్మిషన్ ప్రక్రియ 1 y ago
భారత దేశంలో ఉన్నత విద్యా కార్యక్రమాలను ఆధునీకరించడానికి 1986 సంవత్సరంలో అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించారు. అందులో భాగంగా జవహర్ నవోదయ విద్యాలయ వ్యవస్ధలను స్దాపించారు. ఈ వ్యవస్ధ కేంద్ర ప్రభుత్వ ఆధారిత విద్యా సంస్ధ. ఈ సంస్థ ద్వారా గ్రామీణ జనాభాకు ఆరు నుండి పన్నెండు తరగతుల వరకు ఉచిత రెసిడెన్షియల్ విద్యను అందిస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దేశంలోని ప్రతిజిల్లాలో ఒక జవహర్ నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. 1985-86 సంవత్సరంలో మొదటిసారిగా హర్యానా రాష్ట్రంలోని ఝజ్జర్, మహారాష్ట్రలోని అమరావతిలో రెండు విద్యాలయాలతో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా సుమారుగా 661కు చేరాయి. జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలో అత్యంత ప్రతిభావంతులైన విద్యార్ధులను ఎంపిక చేస్తారు.
ఎంపిక ఇలా.....
ఈ విద్యాలయాల్లో ప్రవేశం పొందేందుకు రిజర్వేషన్ ప్రక్రియ పక్కాగా అమలు చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఓబిసీలకు రిజర్వేషన్లు కల్పిస్తారు. దీనితోపాటు గ్రామీణ ప్రాంతాల నుండి కనీసం 75 శాతం, పట్టణ ప్రాంతాల నుండి గరిష్టంగా 25 శాతం వంతున విద్యార్ధులను ఎంపిక చేస్తారు. ఇక మహిళా విద్యార్ధులకు 33%, వికలాంగ అభ్యర్ధులకు 3% రిజర్వేషన్లను తూ.చ.తప్పకుండా అమలుచేస్తారు. ప్రతి సంవత్సరం 6 నెలల ముందు నోటిఫికేషన్ వస్తుంది. 6వతరగతిలో అడ్మిషన్ పొందగోరే విద్యార్ధి వయస్సు 9 నుండి 13 సంవత్సరాలు మధ్య ఉండాలి. 2024-25 సంవత్సరంలో ఐదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్దులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అది కూడా ఒకసారి మాత్రమే రాయడానికి అర్హులు.
విడుదలైన ఈ ఏడాది నోటిఫికేషన్
ఈ విద్యాలయాల్లో 6వ తరగతిలో అడ్మిషన్ పొందేందుకు 2025-26 సంవత్సారానికి సంబంధించి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది. మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం అడ్మిషన్ టెస్ట్ నిర్వహించడం ద్వారా పిల్లలకు ప్రవేశం కల్పిస్తారు. 6వ తరగతిలో అడ్మిషన్స్ పొందిన విద్యార్ధికి 12వ తరగతి వరకు పూర్తి ఉచితంగా విద్యను అందిస్తారు. నాణ్యమైన విద్యను అందించడం, బాల బాలికలకు వేర్వేరుగా హస్టల్ వసతి కల్పించడం, సిబీఎస్ఈ సిలబస్, ఎన్‌సిసి, స్కౌట్స్ అండ్ ఎన్ఎస్ఎస్ ఈ విద్యా సంస్ధల ప్రత్యేకత.
తీవ్ర పోటీ
ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో ఆరవ తరగతి అడ్మిషన్స్ కోసం విపరీతమైన పోటీ నెలకొంది. విద్యార్ధిని, విద్యార్ధులు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతూ 2024-25 విద్యాసంవత్సరానికిగానూ ఐదవ తరగతి చదువుతూ ఉండాలి. విద్యార్ధి ఏ జిల్లాలో అయితే ఐదవ తరగతి చదువుతున్నాడో ఆ జిల్లాలోనే అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రాత పరీక్షలో ఉండే సిలబిస్ మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్, లాంగ్వేజ్ స్కిల్స్‌లో మూడు విభాగాల్లో ఉంటుంది. 2025-26 విద్యా సంవత్సరానికి దరఖాస్తు చేయడానికి చివరి తేది ఈఏడాది సెప్టెంబరు 16వ తేదీగా నిర్ణయించారు. మీ పిల్లలని నవోదయ స్కూల్స్‌లో చేర్పించి ఉన్నతమైన భావి భారత పౌరులుగా తీర్చి దిద్దాలనుకుంటే వారిని ప్రవేశ పరీక్షకు సన్నద్ధం చేయాల్సిందే మరి.