తెలుగురాష్ట్రాల్లో కూడా ‘నో డిటెన్షన్‌ విధానం’ అమ‌లు... 1 y ago

featured-image

కేంద్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో 5, 8 తరగతి విద్యార్థులకు సంబంధించి నో డిటెన్షన్‌ విధానాన్ని (No-detention policy) రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాహక్కు చ‌ట్టం 2019లో చేసిన సవరణ ప్రకారం, ఇప్పటికే ఈ రెండు తరగతులకు నో డిటెన్షన్‌ విధానాన్ని కనీసం 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు తొలగించాయని కేంద్రం పేర్కొంది. ఇకపై ఈ విధానంతో సంవ‌త్స‌రాంత‌పు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని 5, 8 తరగతుల విద్యార్థులను ఫెయిల్‌ చేసేందుకు అవకాశం ఏర్పడినట్లవుతుంది. 

సాధారణ పరీక్షలో విద్యార్థి పైతరగతులకు ప్రమోట్ కావడంలో విఫలమైతే, గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, మళ్లీ పరీక్ష రాసేందుకు వారికి కొంత సమయం ఇస్తారు. ఫలితాల ప్రకటన తేదీకి రెండు నెలల్లో మళ్లీ పరీక్ష నిర్వహించబడుతుంది. ఆ ప‌రీక్ష‌లోనూ ఫెయిలైతే, సదరు విద్యార్థులు మళ్లీ ఆయా తరగతుల్లోనే చదవాల్సి ఉంటుంది. ప్రాథమికోన్నత విద్య పూర్త‌య్యేంత‌ వరకు ఏ విద్యార్థినీ బహిష్కరింకూడ‌ద‌ని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని దాదాపు 3,000 కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ మరియు సైనిక్ పాఠశాలలకు ఈ నోటిఫికేషన్ వర్తిస్తుందని కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారి తెలిపారు.

పాఠశాల విద్య రాష్ట్ర జాబితాలో ఉండటంతో, ఈ విషయంలో ఆయా రాష్ట్రాలు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పటికే 16 రాష్ట్రాలు, దిల్లీ సహా రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఈ రెండు తరగతుల విద్యార్థులకు నో డిటెన్షన్ పాలసీని రద్దు చేశారని అధికారి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో నో డిటెన్షన్ విధానం అమలవుతోంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD