Sugar Control Precautions: ఈ జాగ్రత్తలు తప్పని సరిగా పాటిస్తే...షుగర్ కంట్రోల్లో ఉంటుంది.! 1 y ago
షుగర్ ను కంట్రోల్ చేసుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రక్తంలో గ్లూకోజు స్థాయి 110 ఎంజీ ఉన్నప్పుడు డయాబెటిస్ ఉండవచ్చని అనుమానించాలి. భోజనం తర్వాత, ఈ స్థాయి 140 ఎంజీ లోపల ఉండాలి. 200 ఎంజీని మించినప్పుడు షుగర్ ఉన్నట్టు అర్థమవుతుంది. షుగర్ పేషెంట్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సమతుల్య జీవనశైలి, పోషకాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం మరియు రోజూ మందులు తీసుకోవడం అత్యంత అవసరం. సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, అధిక ఫైబర్ ఆహారాలు, లీన్ ప్రోటీన్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. యోగా, ఏరోబిక్ వ్యాయామం, మెడిటేషన్ వంటి చర్యలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడటమే కాకుండా, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మరియు ఒత్తిడిని తగ్గిస్తాయి. షుగర్ పేషెంట్స్ ఆహార నియమాలు మరియు జాగ్రత్తల గురించి బీటోస్ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ అపూర్వ గార్గ్ వివరణ ఇచ్చారు.
కార్బోహైడ్రేట్లు మితంగా తీసుకోవాలి
షుగర్ పేషెంట్స్ తమ ఆహారంలో కార్బోహైడేట్లను నియంత్రించడం చాలా ముఖ్యం అని అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ అపూర్వ గార్గ్ తెలిపారు. పోర్షన్ కంట్రోల్లో కార్బోహైడ్రేట్లను ఉంచడం, తక్కువ GI ఆహారాలను ఎంచుకోవడం అవసరమని చెప్పారు. GI తక్కువగా ఉన్న ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. తృణధాన్యాలు, చిక్కుళ్లు, కూరగాయలు వంటి ఆహారాలలో లభించే కార్బోహైడ్రేట్లు శోషణ రేటును నెమ్మదింపజేసి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
సమయానికి సరైన ఆహారం
ప్రతి రోజు సమయానికి ఆహారం తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. భోజనం మానేయడం లేదా సమయానికి తినకపోతే, రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులు కలుగుతాయి. మీ రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడానికి, ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు రోజుకు మూడు సార్లు సమతుల్య ఆహారం తీసుకోవాలి.
ఫైబర్ అధికంగా ఉన్న ఫుడ్స్
షుగర్ పేషెంట్స్ ఫైబర్ రిచ్ ఫుడ్స్‌ను తమ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. మీ డైట్లో పప్పుధాన్యాలు, పండ్లు, కూరగాయలు, బీన్స్, వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చండి. ఫైబర్ అధికంగా ఉన్న ఫుడ్స్ మీ బరువును కంట్రోల్లో ఉంచుతాయి.
ప్రొటీన్
డయాబెటిక్ వ్యక్తులు పౌల్ట్రీ, చేపలు, చిక్కుళ్లు, కొవ్వు తక్కువగా ఉండే పాల ఉత్పత్తుల వంటి లీన్ ప్రోటీన్ ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రోటీన్ ఆకలిని సంతృప్తి పరుస్తుంది మరియు కార్బోహైడ్రేట్ల ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. దీని వల్ల, తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరగదు.
ఆరోగ్యకరమైన కొవ్వు (ఫ్యాట్స్)
నట్స్, విత్తనాలు, అవకాడోలు, ఆలివ్ నూనెల్లో ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవి ఆరోగ్యకరమైన ఫ్యాట్స్. ఈ ఫ్యాట్స్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వేయించిన ఆహారాలు మరియు ప్రాసెస్ చేసిన చిరుతిళ్లకు దూరంగా ఉండండి. ఎందుకంటే అవి అనారోగ్యకరమైన సంతృప్త కొవ్వులు మరియు ట్రాన్స్ ఫ్యాట్స్‌ను కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.
షుగర్‌ను కంట్రోల్లో ఉంచుకోవడం ఎలా.?
డయాబెటిస్ నిర్వహణకు ఆరోగ్యకరమైన ఆహారం మరియు శారీరక శ్రమ చాలా ముఖ్యం. మీ జీవనశైలిలో యోగా మరియు ఏరోబిక్ వ్యాయామాలను చేర్చండి. ఇవి ఇన్సులిన్ నిరోధకత, ఒత్తిడి, ఊబకాయం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా షుగర్ కంట్రోల్లో ఉంటుంది.
గమనిక: పైన అందించిన ఈ ఆరోగ్య సమాచారం మరియు సూచనలు మీ అవగాహన కొరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సమస్య ఉన్నా, వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
వైరల్ ఫీవర్స్ రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు